ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సామర్థ్యం, ప్రజలకు అందుబాటును మరింత పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు ఎండ్-టు-ఎండ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీకి తక్షణమే మారాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గారు 2025 మే 22న G.O.Rt.No.42 విడుదల చేశారు.
జీవోలోని ముఖ్యాంశాలు
- ప్రభుత్వ శాఖలన్ని ఇకపై తప్పనిసరిగా ఈ కింది మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ప్రతి సేవను ఆన్‌లైన్‌లోనే అందించాలి. దరఖాస్తు సమర్పణ దగ్గరనుండి, అంతర్గత ప్రక్రియలు పూర్తి చేసి తుది సేవను అందించే వరకు ప్రతి దశ డిజిటల్‌లోనే జరగాలి. మాన్యువల్ విధానాలకు ఇకపై తావులేదు.
- ప్రభుత్వ శాఖలన్నింటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థలు, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ టూల్స్ వాడటం ద్వారా పారదర్శకత పెంచాలి.
- ఈ విధానం ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి (G2G), ప్రభుత్వం నుండి పౌరులకు (G2C), ప్రభుత్వం నుండి వ్యాపారానికి (G2B) అందించే అన్ని రకాల సేవలకు వర్తిస్తుంది.
- ఏదైనా శాఖకు సొంత వనరులు లేకపోతే, CEO RTGS వాటిని సమకూరుస్తారు.
- ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందిస్తున్న సర్టిఫికేట్ జారీ చేయడం, ఫిర్యాదుల స్వీకరణ, స్టేటస్ ట్రాకింగ్ వంటి సేవలను మన మిత్ర వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలి.
ఈ ఆదేశాల అమలు మరియు పర్యవేక్షణ కోసం, అన్ని శాఖలు ఈ క్రింది డేటాను 2025 మే 30 నాటికి IT, E&C శాఖకు ఇమెయిల్ ద్వారా పంపాలని కోరారు.
- శాఖ పేరు మరియు స్థాయి (రాష్ట్రం/HOD/ప్రాంతీయ/జిల్లా/మండలం/గ్రామం)
- ఆన్‌లైన్ సేవలు, మాన్యువల్ సేవలు, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అందించే సేవల వివరాలు పట్టిక రూపంలో అందజేయాలి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పౌరులకు సేవలను మరింత చేరువ చేయడమే కాకుండా, ప్రభుత్వ కార్యకలాపాల్లో జవాబుదారీతనం పెంచుతుందని భావిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి